కేంద్ర ఎన్నికల సంఘం సార్వత్రిక ఎన్నికల తేదీలను ప్రకటించక ముందే 195 మందితో తొలి జాబితాను విడుదల చేసిన భారతీయ జనతా పార్టీ ఇప్పటి వరకు నిన్న విడుదల చేసిన 7వ జాబితాతో కలిపితే మొత్తం 410 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మిత్రపక్షాలతో కలిసి ‘మిషన్ 400 ప్లస్’ అనే లక్ష్యాన్ని నిర్దేశించుకుని, అందులో తన వాటాగా ‘టార్గెట్ 370’ సాధించాలని చూస్తున్న ఆ పార్టీ.. ఏకంగా సుమారు 108 మంది సిట్టింగ్ ఎంపీలకు ‘నో’ చెప్పింది. అంటే 2019లో గెలుపొందిన 303 మందితో పోల్చితే దాదాపు మూడో వంతు. అంటే ప్రతి ముగ్గురు బీజేపీ ఎంపీల్లో ఒకరిని కట్ చేసింది. తెలంగాణలోని నలుగురు బీజేపీ ఎంపీల్లో ఆదిలాబాద్ సిట్టింగ్ ఎంపీ సోయం బాపూరావుకు టికెట్ నిరాకరించిన ఉదాహరణ మన కళ్ల ముందే ఉంది. దేశవ్యాప్తంగా ఇదే తరహా కసరత్తు జరిగిందని సంఖ్యను చూస్తే అర్థమవుతోంది. సిట్టింగ్ ఎంపీలకు సీట్లు కట్ చేయడం ఒకెత్తయితే.. ప్రత్యర్థుల కంటే చాలా ముందుగానే అభ్యర్థులను ప్రకటించడం మరో ఎత్తు. మొత్తం 543 లోక్‌సభ స్థానాల్లో మిత్రపక్షాలకు పోను బీజేపీ సొంతంగా 440`450 స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉంది. వాటిలో ఇప్పటి వరకు 405 స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేసి జాబితా కూడా విడుదల చేసింది. ఈ లెక్కన చూస్తే అభ్యర్థుల ఎంపికలో బీజేపీ ఇప్పటికే 90 శాతం కసరత్తు పూర్తి చేసింది. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుపుకున్న మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఇదే వ్యూహాన్ని అనుసరించి, తాము ఇంతవరకు గెలవలేకపోయిన నియోజకవర్గాలతో పాటు వరుసగా ఓడిపోతూ వచ్చిన నియోజకవర్గాల్లో మెరుగైన ఫలితాలు సాధించగలిగింది. అంతిమంగా ఆ మూడు రాష్ట్రాల్లోనూ కమలదళం విజయం సాధించి ప్రభుత్వాలను ఏర్పాటు చేయగలిగింది. ఇప్పుడు జాతీయస్థాయిలో ఈ వ్యూహాన్ని అమలు చేస్తూ గతం కంటే మెరుగైన ఫలితాలు సాధించాలని భావిస్తోందిఎంత గొప్ప పాలన అందించినా.. సమాజంలోని అన్ని వర్గాలను సంతృప్తిపర్చడం సాధ్యం కాదు. పదేళ్లుగా వరుసగా అధికారంలో ఉన్న పార్టీ పట్ల ఓటర్లలో సహజంగా ఎంతో కొంత వ్యతిరేకత ఏర్పడుతుంది. ఆ వ్యతిరేకతలో స్థానిక ప్రజా ప్రతినిధుల పనితీరు కూడా ఒక భాగం. కొన్ని సందర్భాల్లో ముఖ్యమంత్రి పాలనపై ప్రజలు సంతృప్తిగానే ఉన్నా.. స్థానిక ఎమ్మెల్యేల తీరు నచ్చక ప్రత్యర్థి పార్టీకి ఓటేసిన సందర్భాలు ఉన్నాయి. ఎక్కడైతే స్థానిక ప్రజాప్రతినిధులు ప్రజలకు అందుబాటులో లేకుండా ఉంటారో, ప్రజలు ఏవగించుకునేలా వ్యవహరిస్తారో.. అక్కడ ఈ తరహా భావన ఏర్పడుతూ ఉంటుంది. తెలంగాణలో వరుసగా 9 సంవత్సరాలు పాలన అందించిన భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) ఓటమికి దారితీసిన కారణాల్లో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్న అభ్యర్థులను సైతం మార్చకపోవడం ఒకటని రాజకీయ విశ్లేషకులు చెబుతూ ఉంటారు. ఇలాంటి ఉదాహరణలు మనకు దేశవ్యాప్తంగా చాలానే కనిపిస్తాయి. అభ్యర్థులను మార్చడం ద్వారా ఈ వ్యతిరేకతను ఎదుర్కోవచ్చు అనేది పార్టీ అధినేతల వ్యూహంగా కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా మూడొంతుల మంది సిట్టింగ్ ఎంపీలకు టికెట్లు నిరాకరించడం వెనుక కూడా ఇదే కారణమని కమలదళం వర్గాలు చెబుతున్నాయి.సిట్టింగ్‌లను మార్చడంలో బీజేపీ ఒక పద్ధతిని అనుసరించింది. వయోధికులు, వరుసగా 3 సార్లు లేదా అంతకంటే ఎక్కువసార్లు గెలిచినవారికి టికెట్లు నిరాకరించింది. తద్వారా ఆయా స్థానాల్లో తర్వాతి తరం నేతలకు అవకాశం దొరికింది. ఇది కార్యకర్తల్లోనూ కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. లేదంటే కొన్ని నియోజకవర్గాల్లో ఒక కుటుంబమే దశాబ్దాలుగా పాతుకుపోయి కూర్చుంటుంది. దాంతో ఆ నియోజకవర్గంలో కష్టపడి పనిచేసే కార్యకర్తలకు అవకాశం దొరక్కుండా పోతుంది. సిట్టింగ్ ఎంపీలనే కాదు, కొద్ది నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన మధ్యప్రదేశ్‌లో సుదీర్ఘకాలం సీఎంగా ఉన్న శివరాజ్ సింగ్ చౌహాన్‌నే మార్చేసింది. అలాగే రాజస్థాన్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో సామాన్య నేతలను సింహాసనం ఎక్కించి ముఖ్యమంత్రులను చేసింది. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల్లో సిట్టింగ్ ఎంపీలను కాదని కొత్తవారికి టికెట్ ఇవ్వడం ద్వారా పార్టీ కార్యకర్తలకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో తెలియజెప్పే ప్రయత్నం చేస్తోంది.అలాగే తరచుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ యావత్ పార్టీకే మచ్చ తెచ్చేలా ప్రవర్తించిన సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్, రమేశ్ బిదూరి, పర్వేష్ సింగ్ సాహిబ్ వర్మ, వరుణ్ గాంధీ, అనంత్ కుమార్ హెగ్డే వంటి సిట్టింగ్ ఎంపీలకు కూడా బీజేపీ నాయకత్వం నిర్మొహమాటంగా నో చెప్పేసింది. పార్టీకి నష్టం కల్గించే చర్యలకు పాల్పడేవారిపై కఠినంగా వ్యవహరిస్తుంది అన్న బలమైన సందేశాన్ని కూడా పంపింది.బీజేపీ ఇప్పటి వరకు ప్రకటించిన 405 మంది అభ్యర్థులతో పోల్చితే కాంగ్రెస్ ఇప్పటి వరకు కేవలం 190 మందిని మాత్రమే ప్రకటించి వెనుకంజలో ఉంది. అభ్యర్థుల ఎంపికలో జరుగుతున్న జాప్యానికి కారణం ఆయా రాష్ట్రాల్లో ఉన్న అంతర్గత కుమ్ములాటలతో పాటు విపక్ష కూటమిలోని పార్టీలతో పొత్తులు, సీట్ల సర్దుబాటు వ్యవహారం తేలకపోవడం వంటివి కారణాలుగా కనిపిస్తున్నాయి. కారణమేదైనా అభ్యర్థుల ఎంపికలో ఆలస్యమయ్యేకొద్దీ వారి ప్రచార సమయం కూడా తగ్గిపోతూ ఉంటుంది. ఆయా నియోజకవర్గాల్లో ప్రత్యర్థి బీజేపీ ప్రచారంలో నాలుగు అడుగులు ముందుంది. టికెట్లు ఖరారైన అభ్యర్థులు ఇప్పటికే విస్తృతంగా ప్రచారం చేసుకుంటూ ఉంటే, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సైతం దేశవ్యాప్తంగా పర్యటిస్తూ బిజీగా ఉన్నారు. ఉత్తరాదిన పెద్ద పండుగల్లో ఒకటిగా ఉన్న హోళీని సైతం ఓటర్లతో కలిసి జరుపుకుంటూ, సంబరాలు, వేడుకల్లో వారిని భాగస్వామ్యం చేస్తూ ముందుకెళ్తోంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు దేశంలో ఒక పెద్ద సభ అంటూ ఎక్కడా నిర్వహించలేకపోయింది. భారత్ జోడో న్యాయ్ యాత్ర ముగింపు సభ విపక్ష కూటమి మిత్రపక్షాల బలప్రదర్శనగానే మారింది తప్ప ఎన్నికల ప్రచార సభగా కనిపించలేదు.
Trending
- భారత నేవీ సాహసోపేత ఆపరేషన్.. హైజాకర్ల నుంచి పాకిస్థానీలను రక్షించిన కమాండోలు
- సెమీస్‌లో సిక్కి జోడీ
- నేడు LSG Vs PBKS మ్యాచ్.. లక్నో బోణీ కొట్టేనా? ప్రిడిక్షన్ ఎలా ఉదంటే
- ‘ఓ భామ అయ్యో రామ’.. సుహాస్ ఖాతాలో మరొకటి!
- వెకేషన్ కి వెళుతున్న రామ్ చరణ్, వచ్చాకే శంకర్ సినిమా
- మల్కాజ్ గిరి అందరికి ప్రతిష్టాత్మకం
- ఇంద్రకరణ్ వస్తే సహాయనిరాకరణే…
- కావ్య బాటలో మరో అభ్యర్ధి…