బెంగళూరు: విరాట్ కోహ్లీ (49 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్స్‌లతో 77) అర్ధ శతకంతో అదరగొట్టడంతో.. ఐపీఎల్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) గెలుపు ఖాతా తెరిచింది. సోమవారం హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో బెంగళూరు 4 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్‌పై నెగ్గింది. తొలుత పంజాబ్ 20 ఓవర్లలో 176/6 స్కోరు చేసింది. ధవన్ (45), ప్రభ్‌సిమ్రన్ సింగ్ (25), జితేష్ (27) రాణించారు. సిరాజ్, మ్యాక్స్‌వెల్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. ఛేదనలో బెంగళూరు 19.2 ఓవర్లలో 6 వికెట్లకు 178 పరుగులు చేసి గెలిచింది. దినేశ్ కార్తీక్ (10 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 28 నాటౌట్) మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. రబాడ, హర్‌ప్రీత్ బ్రార్ చెరో 2 వికెట్లు దక్కించుకొన్నారు. విరాట్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ దక్కింది.
ఆఖర్లో అదరగొట్టారు..: కోహ్లీ ఎడాపెడా షాట్లతో విరుచుకుపడడంతో.. ఛేదనను బెంగళూరు ధాటిగా ఆరంభించింది. కర్రాన్ బౌలింగ్‌లో ఇన్నింగ్స్ రెండో బంతికి బతికి పోయిన విరాట్ నాలుగు బౌండ్రీలతో మోతెక్కించాడు. డుప్లెసి (3), గ్రీన్ (3)ను కూడా రబాడ పెవిలియన్ చేర్చినా.. కోహ్లీ కుదురుకోవడంతో పవర్‌ప్లే ముగిసేసరికి బెంగళూరు 50/2తో నిలిచింది. మధ్య ఓవర్లలో విరాట్, రజత్ పటీదార్ (18) వీలుచిక్కినప్పుడల్లా షాట్లు ఆడుతూ స్కోరు బోర్డును నడిపించారు. అయితే, పటీదార్‌ను హర్‌ప్రీత్ బౌల్డ్ చేయడంతో.. మూడో వికెట్‌కు 43 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. మ్యాక్స్‌వెల్ (3)ను కూడా హర్‌ప్రీత్ బౌల్డ్ చేసి షాకిచ్చాడు. చివరి 5 ఓవర్లలో ఆర్సీబీ విజయానికి 59 పరుగులు కావాల్సి ఉండగా.. విరాట్‌ను అవుట్ చేసిన హర్షల్ జట్టుకు కావాల్సిన బ్రేక్‌ను అందించాడు. ఆ వెంటనే అనూజ్ రావత్ (11)ను కర్రాన్ ఎల్బీ చేయడంతో ఉత్కంఠ రేగింది. కానీ, కార్తీక్, ఇంపాక్ట్ ప్లేయర్ మహిపాల్ లోమ్రోర్ (17 నాటౌట్) 18 బంతుల్లో 48 రన్స్ జోడించడంతో.. ఆర్‌సీబీ మరో 4 బంతులు మిగిలుండగానే నెగ్గింది. ఆఖరి ఓవర్‌లో 10 పరుగులు అవసరమవగా.. కార్తీక్ 6, 4తో ఫినిష్ చేశాడు.
తడబడినా..
పుంజుకొని: బెంగళూరు బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసినా.. ఓపెనర్ ధవన్‌తోపాటు మిడిలార్డర్‌లో కర్రాన్ (23), జితేష్ పోరాడడంతో పంజాబ్ మెరుగైన స్కోరు నమోదు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కింగ్స్.. స్వల్ప స్కోరుకే ఓపెనర్ బెయిర్‌స్టో (8) వికెట్‌ను కోల్పోయింది. అయితే, ప్రభ్‌సిమ్రన్, ధవన్ ఆచితూచి ఆడడంతో.. పవర్‌ప్లే ముగిసేసరికి పంజాబ్ 40/1 స్కోరు చేసింది. అయితే, ఏడో ఓవర్‌లో ప్రభ్‌సిమ్రన్ సిక్స్ బాదగా.. ఆ తర్వాతి ఓవర్‌లో ధవన్ కూడా భారీ షాట్‌తో బ్యాట్‌కు పని చెప్పాడు. స్కోరు వేగం పుంజుకొంటున్న సమయంలో సింగ్‌ను మ్యాక్స్‌వెల్ క్యాచవుట్ చేయడంతో.. రెండో వికెట్‌కు 55 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. నిలకడగా సాగుతున్న పంజాబ్ బ్యాటింగ్ 98 పరుగుల స్కోరు వద్ద ఒక్కసారిగా కుదుపులకు గురైంది. జోసెఫ్ బౌలింగ్‌లో లివింగ్‌స్టోన్ (17) వెనుదిరగ్గా.. క్రీజులో కుదురుకున్న ధవన్‌ను మ్యాక్స్‌వెల్ అవుట్ చేశాడు. ఈ దశలో కర్రాన్-జితే్‌ష ఐదో వికెట్‌కు 52 పరుగులతో ఆదుకొనే ప్రయత్నం చేశారు. దాగర్ వేసిన 15వ ఓవర్‌లో జితేష్ రెండు వరుస సిక్స్‌లతో 17 పరుగులు రాబట్టాడు. కానీ, డెత్ ఓవర్లలో బెంగళూరు బౌలర్లు పట్టు బిగించడంతో.. పంజాబ్ బ్యాటర్లు ఆశించిన రీతిలో షాట్లు ఆడలేక పోయారు. కర్రాన్‌ను యష్.. జితే్‌షను సిరాజ్ అవుట్ చేశారు. అయితే, ఆఖరి ఓవర్‌లో శశాంక్ (8 బంతుల్లో 21 నాటౌట్) 6,6,4తో 20 పరుగులు రాబట్టడంతో.. టీమ్ స్కోరు 170 మార్క్ దాటింది.
స్కోరుబోర్డు
పంజాబ్: ధవన్ (సి) కోహ్లీ (బి) మ్యాక్స్‌వెల్ 45, బెయిర్‌స్టో (సి) కోహ్లీ (బి) సిరాజ్ 8, ప్రభ్‌సిమ్రన్ (సి) రావత్ (బి) మ్యాక్స్‌వెల్ 25, లివింగ్‌స్టోన్ (సి) రావత్ (బి) జోసెఫ్ 17, కర్రాన్ (సి) రావత్ (బి) యశ్ దయాల్ 23, జితేశ్ (సి) రావత్ (బి) సిరాజ్ 27, శశాంక్ (నాటౌట్) 21, హర్‌ప్రీత్ బ్రార్ (నాటౌట్) 2, ఎక్స్‌ట్రాలు: 8; మొత్తం: 20 ఓవర్లలో 176/6; వికెట్ల పతనం: 1-17, 2-72, 3-98, 4-98, 5-150, 6-154; బౌలింగ్: సిరాజ్ 4-0-26-2, యశ్ దయాల్ 4-0-23-1, అల్జారీ జోసెఫ్ 4-0-43-1, గ్రీన్ 2-0-19-0, దాగర్ 3-0-34-0, మ్యాక్స్‌వెల్ 3-0-29-2.
బెంగళూరు: కోహ్లీ (సి) హర్‌ప్రీత్ బ్రార్ (బి) హర్షల్ 77, డుప్లెసి (సి) కర్రాన్ (బి) రబాడ 3, గ్రీన్ (సి) జితేశ్ (బి) రబాడ 3, పటీదార్ (బి) హర్‌ప్రీత్ బ్రార్ 18, మ్యాక్స్‌వెల్ (బి) హర్‌ప్రీత్ బ్రార్ 3, అనూజ్ రావత్ (ఎల్బీ) కర్రాన్ 11, దినేశ్ కార్తీక్ (నాటౌట్) 28, మహిపాల్ (నాటౌట్) 17, ఎక్స్‌ట్రాలు: 18; మొత్తం: 19.2 ఓవర్లలో 178/6; వికెట్ల పతనం: 1-26, 2-43, 3-86, 4-103, 5-130, 6-130; బౌలింగ్: సామ్ కర్రాన్ 3-0-30-1, అర్ష్‌దీప్ 3.2-0-40-0, రబాడ 4-0-23-2, హర్‌ప్రీత్ బ్రార్ 4-0-13-2, హర్షల్ పటేల్ 4-0-45-1, రాహుల్ చాహర్ 1-0-16-0.

